చిత్ర పరిశ్రమను పెనుభూతంలా వెంటాడుతున్న పైరసీని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రీసెంట్ గా “ఐ బొమ్మ” నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తాజాగా చిత్ర పరిశ్రమ పెద్దలతో కలిసి తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ఐ బొమ్మ నిర్వాహకుడిపై సంచలన విషయాలు బయటపెట్టారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ విశాఖ పట్నానికి చెందిన ఇమ్మడి రవి మొదట్నుంచి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడని, ఐ బొమ్మ గురించి సినీ పరిశ్రమ పిర్యాదుతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు అతడ్ని పట్టుకోవడానికి ఎంతో శ్రమించారని తెలిపారు. ఇక ఇమ్మడి రవి భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశం యొక్క పౌరసత్వం తీసుకుని అక్కడినుంచే ఐ బొమ్మ నిర్వహిస్తూ ఈ వెబ్ సైట్ ద్వారా దాదాపు ఇరవై వేలకు పైగా సినిమాలు పైరసీ చేసి అప్లోడ్ చేశాడని, దీని వల్ల చిత్రపరిశ్రమకు ఏకంగా ముప్పై వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు.
ఇక సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఐ బొమ్మలో కీలక సభ్యులైన దుద్దెల శివరాజు, సుచర్ల ప్రశాంత్ లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే రవి 20 కోట్లకి పైగా సంపాదించాడని, అందులో 3 కోట్లు సీజ్ చేశామని త్వరలోనే అతడి దగ్గర పూర్తి సమాచారం రాబడతామని సజ్జనార్ తెలపడం జరిగింది. అయితే ఐ బొమ్మ ద్వారా సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్న దాదాపు 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి హ్యాక్ చేశాడని ప్రజలు ఇప్పటికైనా ఈ పైరసీలకు దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవి, నాగార్జున, ప్రొడ్యూసర్లు దిల్ రాజు, సురేష్ బాబు, దర్శకులు రాజమౌళి తదితరులు హాజరయ్యారు.
