నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ2 మరి కొద్దీ రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బాలయ్య బిజీగా ఉన్నారు. అయితే గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని కాంబోలో బాలకృష్ణ చేసిన వీరసంహారెడ్డి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో సారి వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కుతుండడంతో ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతుందని తాజాగా రివీల్ చేసారు మేకర్స్. ప్రారంభోత్సవ వేడుకలో బాలయ్య ఉన్న ఓ పోస్టర్ లోగోతో ఓపెనింగ్ జరగగా, ఆ పోస్టర్ లో బాలకృష్ణ రెండు వైపులా కత్తులు పట్టుకొని ఓ యోధుడిలా ఉండగా, రెండు లుక్స్ కూడా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పోస్టర్స్ అనిమేషన్ తో ఉండగా, ఈ పోస్టర్ ద్వారా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అనిపిస్తుంది. వ్వారియర్ లుక్ లో ఉన్న బాలకృష్ణ రెండు వైపులా రెండు విభిన్న రాజ్యాల కోటల మీద ఉన్నట్టు పోస్టర్ లోగో ఉంది. అయితే ఈ సినిమా చారిత్రిక నేపథ్యం అయి ఉండొచ్చు, అలాగే జానపద నేపథ్యం కూడా అయి ఉండొచ్చు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. నందమూరి బాలకృష్ణ 111వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను “పెద్ది” సినిమాను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ “వృద్ధి సినిమాస్” వారు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా 2027 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
