త్రిమూర్తుల స్వరూపంగా చెప్పబడే దత్తాత్రేయ స్వామి గురించి హిందూ పురాణాల్లో విశిష్ట స్థానం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామికి దేశంలో అనేక దేవాలయాలున్నాయి. ఎంతో మంది భక్తులు పలురకాల పేర్లతో దత్తాత్రేయ స్వామిని కొలుస్తారు. అందులో దక్షిణాదిన దత్తాత్రేయుడు కొలువైన ఓ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాణుగాపురం ఎక్కడ?
త్రికాలాలైన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు ప్రతీక గా భావించే దత్తాత్రేయుడు కొన్ని క్షేత్రాలలో సశరీరులుగా నడయాడగా, అటువంటి పుణ్య క్షేత్రాలలో ఒకటైన ఊరు “గాణుగాపురం”. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా లోని అఫ్జల్ పూర్ తాలూకా లోని గాణుగాపురం లో దత్తాత్రేయ స్వామి “శ్రీ నరసింహ సరస్వతి స్వామిగా కొలువుదీరాడు.
దత్త జయంతి సందర్బంగా..
ఈ డిసెంబర్ 4న దత్త జయంతి సందర్బంగా గాణుగాపురం దత్తాత్రేయుడి విశిష్టతను తెలుసుకుందాం. అయితే దత్తాత్రేయుని రెండవ అవతారంగా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి శ్రీ కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను తీసుకుని గాణగాపురానికి వచ్చి ఇరవై సంవత్సరాలు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహించాడు. చివరికి తన నిర్గుణ పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదళీ వనములో తన అవతారాన్ని చాలించాడని పురాణాలు చెప్తున్నాయి.
నిర్గుణ పాదుకలు
అయితే స్వామి వారి పాదుకలను “నిర్గుణ” పాదుకలు అంటారు. నిర్గుణ అంటే నిరాకారమైన, ఎటువంటి లక్షణాలు లేనిది అని అర్ధం. ఈ పాదుకలు ప్రపంచంలో మరెక్కడా చూడలేరు. మరో విశేషమేంటంటే ఈ పాదుకలు రాతితో, తయారైనవా, చెక్క తో తయారైనవా అని ఎవ్వరికీ తెలీదు, వాటిని పరీక్షించే ధైర్యం చేయలేరట. కానీ ఆ పాదుకలని తాకితే, ఎంతో మృదువుగా, మానవ శరీరాన్ని తాకిన అనుభూతి కలుగుతుందని అంటారు. అయితే స్వామి పాదుకలను ప్రధానార్చకులు తెల్లవారు జామున 3 నుండి 6 గంటల ప్రాంతంలో మాత్రమే పాదుకలని తాకడానికి అనుమతి ఉందని స్థల పురాణం చెప్తుంది.
భీమా సంగమ స్నానం.. దర్శనం
ఇక గాణుగాపుర క్షేత్రంలో భక్తులు ముందుగా భీమా – అమార్జా నదిగా పిలువబడే నదిలో స్నానమాచరించి, నరసింహ సరస్వతి నిర్గుణ పాదుకల దర్శనం చేసుకోవాలి. స్వామిని గర్భాలయం వెలుపల కిటికీ నుండి మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కల్లేశ్వర స్వామిగా పిలువబడే పరమేశ్వరుని, అలాగే ఉప ఆలయాలుగా ఉన్న పంచముఖ ఆంజనేయుడు, గణపతి, నవగ్రహా దేవతా మూర్తులను దర్శనం చేసుకోవచ్చు.
దుష్ట గ్రహాలు, మానసిక సమస్యలు దూరం..
ఇక ఈ గాణుగాపుర ఆలయ క్షేత్రంలో కుజ దోషం, నాగ దోషం, శని దోషాలున్న వారు అలాగే, ఇతర దుష్ట గ్రహ దోషాలు, లేదా మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారిని ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి, ఒక రాత్రి నిద్రిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని అంటారు. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి నాడు ఇలాంటి కారణాలతో కొన్ని వేల మంది భక్తులు తమ సమస్యలను దూరం చేసుకోవడానికి వస్తారు.
భక్తుల భిక్షాటన..
ఇక గాణుగాపుర లో మరో విశేషం ఏమిటంటే నరసింహ సరస్వతి స్వామి ఇప్పటికీ భక్తుల రూపంలో గాని, ఏదో ఒక రూపంలోనైనా రోజూ మధ్యాహ్నం వేళ 12 గంటలకు భిక్ష కు వస్తారని ప్రతీతి. అందుకే ఇక్కడ ప్రజలు ప్రతీ ఇంట్లోనూ స్వామి వారికోసం తమ శక్తిమేర రొట్టెలు, పాయసం, పళ్ళు వంటి పదార్థాలు సిద్ధం చేస్తారు. అది ఇక్కడి ఆనవాయితీ గా భక్తులు భావించి, క్షేత్రాన్ని దర్శించే చాలా మంది భక్తులు కనీసం అయిదు ఇళ్లలో భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. అలా చేస్తే తాము తెలియకుండా చేసే పాపలు తొలగిపోతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది.
ఇక ఈ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలంటే హైద్రాబాద్ నుండి గుల్బర్గ కి రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. గుల్బర్గ నుండి ఎన్నో ఆటోలు, బస్సుల ద్వారా గుడిని చేరుకోవచ్చు.
