మామూలుగా ట్రావెలింగ్ చేసే జనాల్లో గుళ్లను, చారిత్రిక ప్రదేశాలు సందర్శించే వారి కంటే ప్రకృతి సోయగాలను ఆస్వాదించే వారు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికి శీతాకాల సీజన్లో డిసెంబర్ నెల అనేది ఎంతో బెస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా అటవీ ప్రాంతాలను, కొండలను సందర్శించే వారికి ఈ నెల చాలా బెస్ట్. అయితే శీతాకాల ప్రదేశాలను అనుసరించి తెలుగు రాష్ట్రాల్లో అరకు, తిరుమల హిల్స్, లంబసింగి, తెలంగాణలో లక్నవరం లాంటి ఎన్నో ప్రదేశాలని సందర్శించి ఉంటారు. కానీ ఈ శీతాకాల సీజన్లో కర్ణాటక రాష్ట్రంలో తప్పకుండా విజిట్ చేయాల్సిన అందమైన ప్రదేశాలు కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం.

కూర్గ్..
కర్ణాటకలోని అందమైన పర్యాటక ప్రాంతమైన “కూర్గ్” ని “స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా” గా పలువురు పిలుస్తారు. కొందరైతే ఈ ప్రాంతం ఊటీని మించిన హనీమూన్ స్పాట్ గా చెప్తుంటారు. స్వచ్ఛమైన సువాసనలతో నిండిన ఎన్నో కాఫీ ఎస్టేట్ లు, ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన ప్రసిద్ధ హిల్ స్టేషన్స్ ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్. ఇక ఎంతో అందమైన కొండలు, అద్భుతమైన జలపాతాలతో కూడిన కూర్గ్ ప్రదేశం, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కాఫీ మరియు సుగంధ ద్రవ్యాల తోటల మధ్య నుండి చేసే ట్రెక్కింగ్ ఎంతో ఆస్వాదించవచ్చు. అంతే కాదు ఈ ప్రాంతంలో పలు ఏనుగుల శిబిరాలు, వన్యప్రాణులతో కూడిన అభయారణ్యాలను అలాగే ఇక్కడి స్థానిక “మడికేరి” మార్కెట్‌ను కూడా సందర్శించవచ్చు. ఈ డిసెంబర్ లో పర్యాటకులకు ఈ ప్రాంతం వన్ అఫ్ ది బెస్ట్ ట్రిప్ గా చెప్పవచ్చు. ఇక ఈ ప్రాంతానికి బెంగుళూరు, మైసూర్, మంగుళూరు నుండి రైలు, బస్సు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

నంది హిల్స్..
పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిచ్చే మరో అద్భుత ప్రదేశం “నంది హిల్స్”. ఎంతో ఎత్తైన భారీ కొండల నడుమ ఉన్న నంది హిల్స్ లో ట్రెక్కింగ్ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని, మరియు ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ఇక నంది హిల్స్ దగ్గర “పారా గ్లైడింగ్” మరియు “సైక్లింగ్” మరో స్పెషల్ అట్రాక్షన్. అలాగే ఇక్కడ “యోగానందీశ్వర ఆలయం” కూడా చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. డిసెంబర్ సీజన్లో ఇక్కడ ఉదయం మంచుపడితే చూడాలని కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. ఇక్కడి చిన్న చిన్న రోడ్ల మొదలుకొని, వాగులు, గడ్డి భూములు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అలాగే ఇక్కడ ఎన్నో వందల కోతులు నిత్యం పర్యాటకులని ఆకర్శిస్తాయి. ఇక బెంగుళూరు నుండి బస్సు ద్వారా, అలాగే చిక్ బల్లాపూర్ నుండి బస్సు, రైలు మార్గాల ద్వారా ఈ చోటుని చేరుకోవచ్చు.

చిక్ మంగుళూరు..
కర్ణాటక పర్యాటక ప్రాంతాల్లో మరో అందమైన ప్రదేశం ఈ “చిక్ మంగుళూర్”. ఎంతో ప్రశాంతమైన ప్రదేశంగా పిలువబడే ఈ ఊరులో పర్యాటకులు ఎక్కడికి వెళ్ళినా సువాసనలు వెదజల్లే కాఫీ తోటలు స్వాగతిస్తాయి. ఇక ఇక్కడ ముల్లయనగిరి కొండలు ప్రకృతి ప్రియులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. అలాగే చిక్ మంగుళూరు లో కోదండ రామస్వామి ఆలయం, విద్యాశంకర ఆలయం, శారదాంబ ఆలయం అలాగే అమృతేశ్వర్ ఆలయాలు ఎంతో మంది సందర్శిస్తుంటారు. కదంబి జలపాతం ప్రకృతి ప్రియులకు ఎంతో ఆకర్షిస్తుంది. కర్ణాటకలో మూడో ఎత్తైన ప్రాంతంగా పిలువబడే చిక్ మంగుళూరు కి బెంగుళూర్, మైసూరు ప్రాంతాల నుండి బస్సు రైలు రవాణా మార్గాలున్నాయి.
ఇంకెందుకు ఆలస్యం, ఈ డిసెంబర్ నెలను, శీతాకాల ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి పర్యాటక ప్రియులు ఇప్పుడే బయలుదేరిపోండి.
