life style food health tips

వేడిగా తినాలని చేసిందే మళ్ళీ వేడి చేస్తున్నారా… అయితే ఇది మీకోసమే!

మాములుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో రోజూ మిగిలిపోయిన అన్నం, కూరలను మళ్ళీ వేడి చేసుకొని తినడం బాగా అలవాటు. అయితే ఈ అలవాటు అన్ని పదార్థాలకు వర్తించదని, కొన్ని పదార్థాలు అలా వేడి చేసి తినడం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులో కొన్నిటిని గురించి తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల విషయంలో కొన్ని మళ్ళీ వేడి చేసినవి అస్సలు తినకూడనివి ఉంటాయి.
ఎందుకంటే కొన్ని కూరగాయల్లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని మళ్ళీ వేడిచేసినపుడు అవి నైట్రోసమైన్ లుగా మారతాయి. ఇది శరీరానికి హాని చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులో కొన్నిటిని ఇపుడు తెలుసుకుందాం.

అన్నం : అన్నం రెండోసారి వేడి చేయకూడదు. కానీ మెజారిటీ ఇళ్లల్లో అన్నం దాదాపుగా రెండోసారి వేడి చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల బాసిల్లస్ సెరియస్ బ్యాక్టీరియా పరిమాణం పెరిగి వాంతులు, విరేచనాలు అవుతాయట. అయితే మరీ అంతగా ప్రభావం చూపకపోవచ్చుగాని, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఇలాంటి అలవాటుకి దూరంగా ఉండడం మంచిది.

పాలకూర : పాలకూరలో నైట్రేట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని మళ్ళీ వేడి చేసి తినడం వల్ల ఇది రక్తం ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా పిల్లలలో బ్లూ-స్కిన్ సిండ్రోమ్‌ కు కారణమవుతుంది. అలాగే పెద్దలకు వాంతులు విరోచనాలు కావచ్చు.

పుట్టగొడుగులు : వీటిని మష్రూమ్స్ అని, వాడుక భాషలో పుట్టగొడుగులని అంటారు. చాలా మంది ఇవి హానికారకమని భావించి తినరు. కానీ పుట్టగొడుగులలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. నాన్ వెజ్ కంటే మంచిదని వైద్యులు సలహాలిస్తున్నారు. అయితే ఈ కూరని మళ్ళీ వేడి చేసి తినడం మాత్రం మంచిది కాదని అంటున్నారు. దాని వల్ల గ్యాస్, కడుపునొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉందట.

బంగాళాదుంప : బంగాళాదుంపలు అంటే చాలా మందికి ఇష్టం. కూరగాయలుగా అయినా, స్నాక్స్ గానూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే బంగాళదుంపని కూడా మళ్ళీ వేడి చేసి తినడం మంచిది కాదు, ఇందులో ఉండే బోటులిజం బ్యాక్టీరియా వల్ల ప్రమాదం పెరుగుతుంది. ఇవే కాకుండా క్యారెట్లు, ఇతర దుంపలు వంటి కూరగాయల్లో నైట్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి మళ్ళీ వేడి చేసి తినడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.