తెలంగాణాలో గత వారం రోజులుగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేల ఎన్నికల్ని తలపిస్తున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ఊరిలో చారిత్రకెక్కే విజయాలు దక్కుతుండగా, గంటకో చోట గొడవలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల పార్టీలతో సంబంధం లేకుండా ఒకే కుటుంబానికి చెందిన నేతలు ఆనవాయితీగా గెలుస్తూ ఉండగా, మరి కొన్ని చోట్ల కొత్త యువతరం రాజకీయాల్లోకి ప్రవేశించి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఊరిలో ఒక సర్పంచ్ గెలుపు ఆ ఊరికే హైలెట్ గా నిలిచింది.
తెలంగాణాలో అన్ని చోట్ల జరుగుతున్నట్టే నిర్మల్ జిల్లాలోనూ అన్ని ఊళ్లలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం “బాగాపూర్” గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన “ముత్యాల శ్రీవేద” ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి ఆ జిల్లాకే హైలెట్ గా నిలిచింది. అయితే పోటీ చేస్తున్న కోడలికి ఓటు వేయడానికి అమెరికా నుండి వచ్చి ఓటు వేసాడు ఆమె మామ. తన కోడలు ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిల్చుందని అమెరికా నుండి నాలుగు రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి.
అయితే నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆ ఊరిలో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా, శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, మరో అభ్యర్థి హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188. కాగా ఒక ఓటు చెల్లనిది. దీంతో ఒక్క ఓటు తేడాతో గెలుపొందిన శ్రీవేదను అభినందిస్తున్నారు ఆ ఊరు పెద్దలు. ఇలాంటివే తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల యువత ఎన్నికల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
