Champion Trailer Talk

Champion Trailer : రోషన్ ఈసారి ఛాంపియన్ గా నిలవడం పక్కాగా ఉందే..

శ్రీకాంత్ (Srikanth) నటవారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన “రోషన్” (Roshan) మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి సందడి సినిమాతో హీరోగా పరిచయమైన రోషన్ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా, నటన పరంగా తనకు మంచి భవిష్యత్తు ఉందని ప్రేక్షకుల మెప్పు పొందాడు. అందుకే రెండో సినిమాకి ఏకంగా నాలుగేళ్ల విరామం తీసుకున్నాడు. “ఛాంపియన్” అంటూ ఓ చారిత్రాత్మక ఫిక్షనల్ స్టోరీతో వస్తున్నాడు. కొత్త దర్శకుడు ప్రదీప్ తెరకెక్కించిన ఛాంపియన్ సినిమాను వైజయంతి మూవీస్ (Vyjayanthi movies) బ్యానర్ పై స్వప్న దత్- ప్రియాంక దత్ నిర్మించగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ గా జరిగింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) “ఛాంపియన్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరవగా, ట్రైలర్ ని రాత్రి 8 గంటలకు రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ ద్వారా “ఛాంపియన్” (Champion) తెలంగాణలో బైరాన్ పల్లి ప్రాంత ఘటన నేపథ్యంలో తెరకెక్కిందని, నైజాం ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కున్న కష్టాలు, అలాగే భారత దేశ స్వతంత్ర పోరాటంలో తెలంగాణ ప్రజల పాత్రను ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. దీంతో పాటు హీరో రోషన్ ని ఒక ఫుట్ బాల్ ప్లేయర్ గా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లే ధ్యేయం ఉన్న ఆటగాడిగా చక్కగా చూపించారు.

ఇక సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. దాంతో పాటు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే మలయాళ హీరోయిన్ “అనశ్వర రాజన్” ఛాంపియన్ తో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇక మొదటి సినిమా పెళ్లి సందడితో అంతగా ప్రభావం చూపలేకపోయిన రోషన్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుని ఇండస్ట్రీలో రాణిస్తాడనిపిస్తుంది. మరి డిసెంబర్ 25న రిలీజ్ కాబోయే ఛాంపియన్ ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.