Akhanda 2 ticket hike controvesy in Telangana

నైజాంలో అఖండ 2 మేకర్స్ కు షాక్.. టికెట్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు

నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ తాండవం” గతవారం నిర్మాతల ఆర్ధిక ఇబ్బందుల వలన వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుని ఇప్పుడు నిర్మాతలు డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి సిద్ధమవగా, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అఖండ2 పై స్పెషల్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి కూడా తీసుకున్నారు మేకర్స్. అఖండ 2 విడుదల ముందు రోజు డిసెంబర్ 11న రాత్రి 8 గంటల స్పెషల్ షోకు పర్మిషన్ కూడా ఇవ్వగా, టికెట్ రేట్ 600 రూపాయలకు పర్మిషన్ కూడా తీసుకున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణాలో విడుదలైన రోజు నుండి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ థియేటర్లలో రూ.100 పెంచుకునేందుకు ఓ షరతుపై ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టగా, ఆ కండిషన్ ప్రకారం అఖండ2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇస్తామని ఒప్పుకున్నారు.

ఇక రేపు రిలీజ్ ఉందనగా అఖండ 2 బుకింగ్స్ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ బుకింగ్స్ దాటేశాయి. అయితే తాజాగా అఖండ 2 మేకర్స్ కి నైజాం నుండి మరో షాక్ తగిలింది. రేపు థియేటర్లలో అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోరులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వగా, టికెట్ ధరలతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై కూడా తెలంగాణ హైకోర్టు విచారణ జరుపనుందని సమాచారం. మరి దీన్ని నిర్మాతలు ఏ విధంగా ఎదుర్కుంటారో చూడాలి. నందమూరి అభిమానులు మాత్రం రేపు థియేటర్లలో అఖండ2 రిలీజ్ అయిపోయాక మాత్రం ఎవ్వరూ ఏమి చేయలేరని అభిప్రాయపడుతున్నారు.