సినిమా ఇండస్ట్రీలో కొందరు సెలెబ్రిటీలు తాము ఫామ్ లో ఉన్నప్పుడు ఎంతో అనుభవించి తమ ఫామ్ కోల్పోయేలోపు సెటిల్ అవకుండా తప్పు చేసి ఇప్పుడు కనీసం నీడ లేకుండా కష్టాలు పడుతున్నారు. అలాంటి వారిలో పావలా శ్యామల ఒకరు. గణేష్ పాత్రలో రచించిన పావలా సినిమాతో నటి అయిన ఈమె, దాదాపు మూడు వందల చిత్రాల్లో ఎంతో మంది స్టార్ నటీనటులతో నటించారు. లాక్ డౌన్ ముందు వరకు కూడా ఈమె పరిస్థితి బాగానే ఉన్నా, ఇప్పడు మాత్రం అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఈమె పరిస్థితి తయారయింది.
వయసు మీద పడడంతో శ్యామల నటనకు దూరంకాగా, కన్న బిడ్డలు లేక, సొంతిల్లు లేక, ఇప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు అనుభవిస్తుంది. అయితే గతంలోనూ ఈమె పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి 2 లక్షల రూపాయలు ఆర్థికంగా సాయం చేసి ఆదుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్, సాయి ధరమ్ తేజ్ లాంటి సెలెబ్రిటీలు కూడా సాయం చేసారు. అయితే ఇప్పుడు ఈమె పరిస్థితి మరింత దిగజారడంతో కొన్నేళ్లుగా ఒక ఓల్డేజ్ హోమ్ లో తన కూతురుతో కలిసి నివసిస్తున్నారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు కూడా సేవలు అందించలేక బయటికి పంపిచేశారట.
దీంతో ఈ వయసులో సరైన ఆధారం లేక నిరాశ చెందిన శ్యామల తన కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. ఈ క్రమంలో రోడ్డుపై దారుణమైన స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను గమనించిన కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమె పరిస్థితి గమనించి, “ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్” సెంటర్లో చేర్పించారు. ఈ ఆర్కే ఫౌండేషన్ సంస్థ ఫౌండర్ రామకృష్ణ పావలా శ్యామల తల్లి కూతుర్లకు తాము ఆశ్రయం కల్పించి అన్ని సేవలు అందిస్తామని ప్రకటించారు. అయితే శ్యామల వయోభారం వల్ల ఎటూ కదలలేని స్థితిలో ఉందని, ఆర్థికంగా ఇండస్ట్రీ నుండి మరోసారి చేయూతనిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.
