తెలంగాణ లో కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త మార్పు జరుగుతుందని జనాలు భావించగా, ప్రస్తుతం దానికి వ్యతిరేకంగానే రాజకీయం నడుస్తుందని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా రాజకీయనాయకుల నుండి ప్రజలకే కాదు పోలీసుల నుండి కూడా రక్షణ లభించడం లేదని జనాభిప్రాయం. రీసెంట్ గా హైదరాబాద్ లో 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి, కేసులో బుక్ అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొడుకు పొంగులేటి రాఘవ గురించిన న్యూస్ వినే ఉంటారు. అయితే ఆ విషయంపై షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.
గత నవంబర్ 30న గచ్చిబౌలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కొడుకు పొంగులేటి రాఘవ అతని కంపెనీ కోసం, గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించిన సంగతి తెలిసిందే. అక్కడ 70 మందికి పైగా తన బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూల్చివేసి అడ్డుకున్న స్థలం యజమానిపై దాడిచేసినందుకు, గచ్చిబౌలి పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయగా, అక్కడ ఉన్న గోశాలను సైతం ధ్వంసం చేసినట్టు మహిళ ఆరోపించింది.
అయితే తాజా మీడియా కథనాల ప్రకారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవ మీద కేసు పెట్టినందుకు గచ్చిబౌలి ఎస్సై అయిన మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ కి గట్టి పనిష్మెంట్ ఇచ్చారట. మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ ను వేకెన్సీ రిజర్వ్ పేరిట గట్టి పనిష్మెంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారని సమాచారం. ఇక ఎస్సై హబీబుల్లా ఖాన్ ఇటీవల శిఖా గోయల్ నుండి “లా అండ్ ఆర్డర్” విభాగంలో “సురక్షిత్ హైదరాబాద్” అవార్డును కూడా అందుకోవడం గమనార్హం. ఈ న్యూస్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారగా, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
