టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji) గత రెండు రోజుల కిందట “దండోరా” (Dandora) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై చేసిన ఘాటు కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఈ విషయంపై “మా” (MAA) అసోసియేషన్ లో పలువురు తెలుగు నటీమణులు శివాజీపై పిర్యాదు కూడా చేసారు. అయితే ఆ తర్వాత బుధవారం సాయంత్రం శివాజీ ఓ వీడియో రిలీజ్ చేసి మహిళలకు క్షమాపణలు కూడా తెలియచేసాడు. అయితే మరో సారి దండోరా ప్రెస్ మీట్ లో శివాజీని టార్గెట్ చేస్తూ మీడియా పలు ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో శివాజీ చాలా ఎమోషనల్ అవుతూ స్పందించారు.
దండోరా ప్రెస్ మీట్ లో శివాజీ తాను చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ఈ విషయం మహిళా కమిషన్ వెళ్లడం చాలా బాధగా ఉందని, తాను మాట్లాడిన మాటలకు తప్పని అనిపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని శివాజీ చెప్పుకొచ్చారు. అసలు ఈ విషయంపై ప్రేక్షకులు గాని, మహిళలు గాని ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని శివాజీ అభిప్రాయపడ్డారు.
అయితే సెలెబ్రెటీల నుంచి వచ్చే మాటలు, అవి సమాజ విలువలకు సంబంధించిన విషయం కాబట్టి, మహిళా కమిషన్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందని శివాజీ అంగీకరించి, తనను ఒక్క మాట అడగకుండానే అంత దూరం వెళ్లడం చాలా బాధ కలిగించిందని అన్నాడు. అయితే తప్పు తనది కాబట్టి భరిస్తానని శివాజీ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఒకవేళ మహిళా కమిషన్ తనకు మరణశిక్ష వేసినా తనకు ఆనందమే అని శివాజీ ఆవేదనతో మాట్లాడారు. చివరగా ఇప్పటికి కూడా తాను మాట్లాడిన ఉద్దేశం మంచిదేనని, ఆ చివరి రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని, అది తన తప్పే అని, మనం మనుషులం కాబట్టి ఇలాంటి తప్పు పదాలు పొరపాటున నోటి నుండి రావడం సహజమే అని అన్నాడు. ఇక శివాజీ కీలకపాత్రలో నటించిన “దండోరా” డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది.
