SP Balasubrahmanyam Statue controversy

SPB విగ్రహాన్ని అడ్డుకుంటుంది నిజంగా తెలంగాణ వాదులేనా? లేక ఇంకెవరైనా?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ చిత్ర రంగానికి చేసిన సేవలు, తెలుగు చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు ఎంతో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన భౌతికంగా దూరమైనా పాటల రూపంలో అభిమానుల్ని నిత్యం పలకరిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం హైదరాబాద్‌ లోని ప్రముఖ సాంస్కృతిక కళా కేంద్రమైన “రవీంద్రభారతి” ప్రాంగణంలో “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం” విగ్రహ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల డిసెంబర్ 15న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలుగు భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవడంతో పాటు, సీఎం రేవంత్ రెడ్డిని విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా నటుడు శుభలేఖ సుధాకర్ ఆహ్వానించడం జరిగింది. ఇక ఎస్పీ బాలు బావ మరిది నటుడు అయిన శుభ‌లేఖ సుధాక‌ర్‌ క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు విగ్రహ ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలించారు.

అయితే తాజాగా కొన్ని రోజుల నుండి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నటుడు శుభలేఖ సుధాకర్‌ – పృథ్వీరాజ్ ల మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. కొన్ని వైరల్ అయిన వీడియోల ప్రకారం పృత్విరాజ్ కాస్త దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. అయితే పృత్వి రాజ్ మాటల ప్రకారం ఈ తెలంగాణ గడ్డపై ప్రజా కవులు కాళోజి, అందెశ్రీ, గద్దర్ లాంటి వ్యక్తులకు గౌరవం దక్కాలని, బయటి వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించమని అన్నాడు. అయితే నటుడు శుభలేఖ సుధాకర్ మరికొందరు వ్యక్తులతో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.

అయితే తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్తున్న పృత్విరాజ్ నిజంగా బాలు విగ్రహాన్ని తెలంగాణ వాడు కాదు అని మాత్రమే అడ్డుకున్నాడా? లేక మరేమైనా కారణాలున్నాయా, లేక ఎవరైనా రాజకీయ నాయకుల హస్తం ఇందులో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అప్పట్లో తెలంగాణ ఏర్పాటు సమయంలో తెలంగాణ గీతాన్ని బాలు పాడానన్నారని, ప్రముఖ రచయిత రసమయి బాలకృష్ణ వ్యాఖ్యానించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన తెలంగాణ వ్యతిరేకి అని పృత్విరాజ్ ఆరోపించారు.

అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే దేశంలో తెలియని వారుండరు. తెలుగువాడైన బాలుని తమిళ, కన్నడ సినిమా వాళ్ళు తెలుగు వారిని మించి ఆదరిస్తారు. తమిళనాడు ప్రభుత్వం కూడా బాలు తదనంతరం ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పించారు. ఇక దేశ కళా సాంస్కృతిక రంగాల్లో బాల సుబ్రహ్మణ్యం చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన బాలు 15 భాషల్లో తన గాత్రాన్ని ఆలపించారు.

అయితే బాలు విగ్రహ ఏర్పాటుని సపోర్ట్ చేస్తున్న అభిమానులు ఏమంటున్నారంటే, తెలంగాణాలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుల విగ్రహాలు, ముఖ్యంగా రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, అంబేద్కర్ వంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టారని, అలాగే రవీంద్ర భారతికి బెంగాలీ కవి అయిన రవీంద్ర నాథ్ ఠాగూర్ పేరుని ఎందుకు పెట్టారని వాదిస్తున్నారు. ఇలా తెలంగాణ కి సంబంధం లేని ఎంతో మంది రాజకీయనాయకుల విగ్రహాల్ని పెట్టినపుడు బాలు విగ్రహానికి ఇలా నీచ రాజకీయాలతో అడ్డుకోవడం సరి కాదని పలువులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం ఈ వివాదం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.