వింటర్ లో తెలుగు రాష్ట్రాల ప్రజలు మెల్లిగా ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. దసరా తర్వాత శీతాకాలం మొదలైన కొద్ధి రోజులకే జనం సాయంత్రం ఏడు దాటితే ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఇక డిసెంబర్ వచ్చేశాక పగలు కూడా పని ఉంటే తప్ప బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. ఇక సిటీ ప్రాంతాల్లో కూడా ఎముకలు కొరికే రేంజ్ లో చలి పులి జనాలను దెబ్బతీస్తుంది. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రి ఏడు దాటాక బయట తిరగడం, ఆరు బయట నిద్రపోవడం వంటివి చేయడం మంచిది కాదని, ముఖ్యంగా ముసలి వాళ్ళు ఊళ్లలో రాత్రి ఆరు బయట ఉండడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు చెప్తున్నారు.
ఇక ఈ డిసెంబర్ లో ఇప్పటికే సింగిల్ డిజిట్ లో లోయస్ట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రతను గమనిస్తే, ఆంధ్ర ప్రదేశ్ లో అల్లూరి జిల్లా మొదలుకొని, మినుములూరు 4, అరకు 4.5, చింతపల్లి 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అరకు లంబసింగి వంటి ప్రాంతాలకు చలి ఎంత తీవ్రంగా పెరిగినా, పర్యాటకుల సందడి ఎక్కువైంది.
అలాగే తెలంగాణ విషయానికి వస్తే, మరో వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటే 4 – 5 డిగ్రీలు తగ్గుతాయని అంటున్నారు. ఇక రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల పరిధిలో 5.6 డిగ్రీలుగా నమోదైంది. ముందు ముందు ఇంతకంటే తక్కువ నమోదయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిళ్ళు బయటికి రాకూడదని నిపుణులు చెప్తున్నారు.
